Sunita Williams: అంతరిక్ష యాత్రలో సునీతా విలియమ్స్..! 1 y ago
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ 1965, సెప్టెంబరు 19న అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో జన్మించారు. తన తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ లోని జులాసన్ గ్రామానికి చెందినవారు. మేరీల్యాండ్‌లోని అనాపోలిస్ అమెరికా నేవల్ అకాడమీ నుంచి 1987లో భౌతిక శాస్త్రంలో డిగ్రీ పొందిన తర్వాత 1989లో నేవల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండ్ నేవల్ ఏవియేటర్లో చేరారు. 1993లో ఆమె అమెరికా నేవల్ టెస్ట్ పైలట్ స్కూలులో ప్రవేశం పొందారు. 1995లో వ్యోమగామి అయ్యేందుకు మెల్ బోర్న్ లోని ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఎమ్ఎస్ పూర్తి చేశారు. 1998లో వ్యోమగామిగా శిక్షణ పొందారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉత్పత్తికి అవసరమయ్యే రోబోటిక్స్ వంటి అనుభవాలను పొందేందుకు ఆమె రష్యాకు వెళ్లారు. 2006లో తొలి అంతరిక్ష యాత్రతో కల్పన చావ్లా తరువాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళగా సునీతా విలియమ్స్ నిలిచారు. మొత్తంగా మూడుసార్లు (2006, 2013, 2024) అంతరిక్ష యానం చేశారు. 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ కీర్తి చెందారు. ఎక్కువ సమయం పాటు స్పేస్ వాక్ చేసిన వారి అందరిలో సునీతా విలియమ్స్ నాలుగో స్థానంలో ఉన్నారు. 2007లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ట్రెడ్ మిల్ పై మారథన్ రన్ చేసిన తొలి వ్యక్తిగా సునీతా విలియమ్స్ రికార్డు సృష్టించారు. అంతరిక్ష రంగంలో విశేష సేవలందించినందుకు గాను నాసా స్పేస్ ఫ్లైట్ మెడలను అందుకున్నారు. 2007 లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ ప్రతిభా పురస్కారంతోనూ, 2008లో పద్మ భూషణ్ పురస్కారంతోనూ భారత ప్రభుత్వం పురస్కరించింది.